Telangana: రాజకీయాలు చేసే ఏ గవర్నర్ అయినా పనికిమాలిన గవర్నరే: సీపీఐ నారాయణ
- తమిళిసై లక్ష్మణ రేఖ దాటారన్న నారాయణ
- వ్యవస్థలను బీజేపీ కార్పొరేట్లకు అప్పగిస్తోందని విమర్శ
- అదానీ, అంబానీలపై తమిళిసై ఎందుకు మాట్లాడరని ప్రశ్న
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవిలో ఉన్న తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని, ఆమెను తక్షణమే గవర్నర్ పదవి నుంచి రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నారాయణ స్పందిస్తూ, గవర్నర్‌గా కొనసాగుతున్న తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని తాను గతంలోనే చెప్పానని అన్నారు. ఇప్పుడు కూడా తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం అన్ని వ్యవస్థలను కార్పొరేట్లకు ప్రత్యేకించి అదానీకి అప్పగిస్తోందని ఆయన ఆరోపించారు. అదానీ, అంబానీలపై గవర్నర్ తమిళిసై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలు చేసే ఏ గవర్నర్ అయినా పనికిమాలిన గవర్నరేనని నారాయణ సంచలన వ్యాఖ్య చేశారు.