Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
- తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- రాగల 48 గంటల్లో బలపడనున్న వైనం
- ఏపీలో శనివారం వరకు వర్షాలు
- కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
కోస్తాంధ్రలో ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగళాఖాతం నడుమ అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడుతుందని తెలిపింది. క్రమేపీ ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలవైపు పయనిస్తుందని వివరించింది.
దీని ప్రభావంతో శనివారం వరకు ఏపీలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలో అక్కడడక్కడ భారీ వర్షాలు పడతాయని, ముఖ్యంగా కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.