Andhra Pradesh: ముంపు ముప్పులో నంద్యాల... అంతకంతకూ పెరుగుతున్న మద్దిలేరు వరద
- బ్రిడ్జిపై 2 అడుగుల మేర పొంగి ప్రవహిస్తున్న మద్దిలేరు
- నంద్యాల లోతట్టు ప్రాంతాలు జలమయం
- జంబులా పరమేశ్వరి ఆలయానికి నిలిచిన రాకపోకలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో గడచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కరవు సీమ రాయలసీమలో వాగులు, వంకలు ఏళ్ల తర్వాత జలకళను సంతరించుకున్నాయి. అదే సమయంలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతుండటంతో రాయలసీమలోని పలు పట్టణాలు ముంపు ముప్పులో పడ్డాయి.
ఇటీవలే జిల్లా కేంద్రంగా మారిన నంద్యాల పట్టణం ప్రస్తుతం వరద ముంపు ముంగిట నిలిచింది. పట్టణం మీదుగా ప్రవహించే మద్దిలేరు వాగు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రవహిస్తోంది. నంద్యాల, కర్నూలు మధ్య రహదారిపై నిర్మించిన బ్రిడ్జిపై ఏకంగా 2 అడుగుల మేర పొంగి ప్రవహిస్తోంది.
అదే సమయంలో పట్టణానికి సమీపంలోని కుందూ నది కూడా పొంగి ప్రవహిస్తోంది. గంటగంటకూ మద్దిలేరు వరద ప్రవాహం పెరిగిపోతోంది. ఇప్పటికే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టణానికి సమీపంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పట్టణానికి సమీపంలోని జంబులా పరమేశ్వరి అలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.