Ice caves: మంచు దిగువన హరివిల్లు.. అటు అద్భుతం, ఇటు ప్రమాదం కలిసి ఉన్న గుహల ప్రత్యేకతలు ఇవీ..
- అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్ లో చిత్రమైన గుహలు
- సౌర కాంతిని ప్రతిఫలిస్తూ అద్భుతమైన దృశ్యాలు
- మంచు విరిగి పడుతుండటంతో ప్రవేశాన్ని నిషేధించిన అధికారులు
- ఇటీవల రిస్క్ చేసి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకువచ్చిన ఓ ఫొటోగ్రాఫర్
తెల్లని పాల రాతిపై చెక్కి, రంగులు అద్దిన అద్భుత శిల్పాల్లా కనిపిస్తున్నాయా.. లేక రంగు రంగుల హరివిల్లు విరిసినట్టుగా ఆకర్షణీయమైన పెయింటింగ్ లలా ఉన్నాయా.. అందంగా కనిపించడం సరే.. కానీ అత్యంత ప్రమాదకరమైన మంచు గుహల్లో అందాలు ఇవి. అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న మౌంట్ రైనర్ నేషనల్ పార్క్ లో ఉన్న ఓ మంచు గుహ ఇది. అందులో ఇన్ని రంగుల్లో మెరుస్తున్నది కేవలం సౌర కాంతి ప్రతిఫలించి ఏర్పడిన రంగుల చిత్రం మాత్రమే.
సూర్యరశ్మి ప్రతిఫలించి..
నిత్యం మంచుతో కప్పబడి ఉండే ఈ మంచు గుహ చాలా ప్రత్యేకమైనది. దీనికి ఉన్న ఒక ద్వారం ద్వారా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించి మంచుపై ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రతిఫలించే క్రమంలో సౌర కాంతి వివిధ రంగులుగా (అంటే హరివిల్లు మాదిరిగా) విడిపోయి పరావర్తనం చెందుతుంటుంది. అదే ఇలా అద్భుతమైన దృశ్యాలుగా కనువిందు చేస్తుంది.
ఇవి అత్యంత ప్రమాదకరం
- ఇంత అందమైన దృశ్యాలు కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా.. పెద్ద సంఖ్యలో పర్యాటకులు, ఫొటోగ్రాఫర్లు ఈ గుహకు క్యూకట్టడం మొదలుపెట్టారు. కానీ గుహల పైభాగం నుంచి తరచూ పెద్ద పెద్ద మంచు పెళ్లలు విరిగి పడుతుంటాయి. అలా మనపైగానీ పడిందంటే.. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.
- ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల కిందే ఈ గుహల్లోకి ప్రవేశించడాన్ని ఇక్కడి నేషనల్ పార్క్ అధికారులు నిషేధించారు.
- ఈ గుహల్లో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. మంచుతోపాటు నీరు కరిగి పడుతుంటుంది. అందువల్ల జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశాలూ ఎక్కువే.
- ఇక ఈ గుహల్లో ఆక్సిజన్ స్థాయులు కూడా తక్కువగా ఉంటాయని, లోపలికి వెళ్లినవారికి ఊపిరి ఆడక స్పృహ తప్పే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- ఇంత ప్రమాదకరమే అయినా మ్యాథ్యూ నికోలాస్ అనే ఓ ఫొటోగ్రాఫర్ ఇటీవల ఈ గుహలోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకువచ్చారు. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టడంతో వైరల్ గా మారాయి.