Errabelli: గవర్నర్ తమిళిసై బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు: మంత్రి ఎర్రబెల్లి
- తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై
- అనేక అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడి
- తమిళిసై గవర్నర్ వ్యవస్థను కించపరుస్తారన్న ఎర్రబెల్లి
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా కాక పుట్టించాయి. గత మూడేళ్లుగా తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆమె ఆరోపించారు. దాంతో 8 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చిందని, ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయని, వాటిని బయటికి చెప్పడం బాగోదని ఆమె పేర్కొన్నారు. ప్రొటోకాల్ పాటించని ఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఎట్ హోంకు వస్తానని చెప్పి సీఎం కేసీఆర్ రాలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. గవర్నర్ తమిళిసై బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆమెను ఓ ఆడపడుచులా చూసుకున్నామని, కానీ, ఆమె గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమె మేడారం వస్తున్న సమాచారాన్ని స్థానిక మంత్రులమైన తమకు అందించలేదని ప్రత్యారోపణ చేశారు.
గవర్నర్ చేష్టలు ప్రజలను బాధపెట్టేవిగా ఉంటున్నాయని విమర్శించారు. ఇకనైనా పదవికి తగినట్టు హుందాగా ప్రవర్తించాలని గవర్నర్ ను కోరుతున్నానని, చేతుతెల్తి మొక్కుతానని, దయచేసి బీజేపీ కార్యకర్తలా వ్యవహరించడం మానుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.