Britain: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 ఇకలేరు!
- అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన రాణి
- బ్రిటన్ ను 70 ఏళ్లు పాలించిన రాణిగా రికార్డు
- భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 (96) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎలిజబెత్ 2 భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. స్కాట్లాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి మరణ వార్తను ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబసభ్యులంతా ముందుగానే స్కాట్లాండ్‌లోని రాణి నివాసానికి చేరుకున్నారు. రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని శుక్రవారం బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకురానున్నట్లు తెలిపాయి. రాణి మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది.
70 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ 2 గుర్తింపు పొందారు. 1922లో జన్మించిన ఆమె ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్‌ను 1947లో వివాహం చేసుకున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. రాణి 70 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్2 మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ నిలిచిపోతారని మోదీ అన్నారు. బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని ఆయన కొనియాడారు.