Amit Shah: అమిత్ షాను దేశంలో అతి పెద్ద పప్పు అన్నది అందుకే: మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్
- పశువుల స్మగ్లింగ్ స్కామ్ లో గత వారం అభిషేక్ ను గంటల తరబడి విచారించిన ఈడీ
- అనంతరం అమిత్ షా పై తీవ్ర విమర్శలు చేసిన టీఎంసీ ఎంపీ
- షా అధీనంలో ఉన్న ఢిల్లీలో నేరాల రేటు ఎక్కువని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ... కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తనతో పాటు బెంగాల్ లోని పలువురు మంత్రులను టార్గెట్ చేసిన వేళ అమిత్ షాను ‘భారత దేశంలో అతి పెద్ద పప్పు’ అని అంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.
అభిషేక్ ఈ కామెంట్ చేసిన తర్వాత.. టీఎంసీ నాయకులు అమిత్ షా ముఖంతో పాటు ‘భారతదేశంలో అతిపెద్ద పప్పు’ అనే క్యాప్షన్ ఉన్న టీ-షర్టులను తన పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రిపై తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానో అభిషేక్ వివరించారు.
అభిషేక్ బెనర్జీ పశువుల స్మగ్లింగ్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలను ఎదుర్కొంటున్నారు. బెనర్జీని ఈడీ గత వారం గంటల తరబడి ప్రశ్నించింది. ఆ తర్వాత అమిత్ షాను ఆయన భారతదేశపు అతిపెద్ద పప్పు అంటూ వ్యాఖ్యానించారు. గురువారం బెంగాల్‌లోని టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన దీనిపై స్పందించారు.
‘కారణాలున్నాయి కాబట్టే అమిత్ షాను అతి పెద్ద పప్పు అని పిలిచాను. ఒకసారి ఢిల్లీ నేరాల రేటు చూడండి. కోల్‌కతాలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని మీ స్వంత ఏజెన్సీ తెలిపింది. ఢిల్లీ పోలీసులు మాత్రం హోం మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్నారు. అయినా అక్కడ క్రైమ్ రేట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. మీరు (అమిత్ షా) అందరికీ జాతీయవాదాన్ని బోధిస్తారు. కానీ మీ అబ్బాయి(బీసీసీఐ కార్యదర్శి జై షా)కి మాత్రం జాతీయ జెండా పట్టుకోవడంలో ఇబ్బంది ఉంది. ముందుగా అతనికి నేర్పించండి‘ అని షా ను ఉద్దేశించి బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించిన తర్వాత జై షా జాతీయ జెండాను ఊపేందుకు నిరాకరించారు.