Andhra Pradesh: అమరావతి రైతుల మహాపాద యాత్రకు అనుమతి నిరాకరణ.. అర్ధరాత్రి ఉత్తర్వుల జారీ
- ఈ నెల 12న యాత్ర చేపట్టనున్న రైతులు
- శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న డీజీపీ
- ఎవరు వస్తారో.. ఎంతమంది వస్తారో మీకే స్పష్టత లేదన్న పోలీస్ బాస్
- గత యాత్రకు పెట్టిన షరతులను ఉల్లంఘించారని ఆరోపణ
- అప్పట్లో 71 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేసిన డీజీపీ
అమరావతి రైతులు తలపెట్టిన మహాపాద యాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర చేపట్టాలని రైతులు నిర్ణయించారు. ఈ నెల 12న పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లలో రైతు నాయకులు తలమునకలయ్యారు.
అయితే, వీరి యాత్రకు అనుమతిని నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గత అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పాదయాత్రలో 200 మంది పాల్గొంటారని చెప్పారని, ఒకవేళ సంఖ్య పెరిగితే ఒక్కో బృందంలో 200 మంది చొప్పున వేర్వేరుగా యాత్ర చేపడతామని చెప్పినప్పటికీ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. యాత్ర సాగే జిల్లాల పోలీసుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న మీదటే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీజీపీ అందులో పేర్కొన్నారు.
గతేడాది అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన యాత్రకు కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో అనుమతులిచ్చిన విషయాన్ని డీజీపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాదయాత్ర సందర్భంగా తాము పెట్టిన షరతులన్నింటినీ ఉల్లంఘించారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో మొత్తం 71 క్రిమినల్ కేసులు నమోదు కాగా, రెండింటిలో శిక్ష కూడా పడిందన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంతమంది పాల్గొంటారన్న విషయంలో మీకే స్పష్టమైన అవగాహన లేదని, ఎవరు వస్తారో తెలియనప్పుడు వారిని గుర్తించడం, పర్యవేక్షించడం అధికారులకు కష్టమవుతుందని, అందుకనే అనుమతి నిరాకరిస్తున్నట్టు తెలిపారు.
మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని, కాబట్టి భద్రత కల్పించడం సాధ్యం కాదన్నారు. ఇటీవల ఉద్రిక్తంగా మారిన కోనసీమ ప్రాంతం మీదుగా యాత్ర సాగుతుందని, ఆ సమయంలో అక్కడ చిన్నపాటి గొడవ జరిగినా పెద్ద సమస్యగా మారి శాంతిభద్రతలకు విఘాతంగా మారుతుందని డీజీపీ వివరించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొన్నారు.