Pawan Kalyan: జపాన్ లో భద్రపరిచిన నేతాజీ అస్థికలను భారత్ రప్పించండి: ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ విన్నపం

Pawan Kalyan appeals Modi to bring back Netaji mortal remains from Japan

  • ఢిల్లీలో రాజ్ పథ్ కు కర్తవ్య పథ్ గా పేరుమార్పు
  • మోదీ నిర్ణయాన్ని కొనియాడిన పవన్
  • మోదీ తన వాగ్దానాన్ని నిలుపుకుంటున్నారని అభినందనలు
  • నేతాజీ మనుమరాలి డీఎన్ఏతో అస్థికలను పోల్చాలని విజ్ఞప్తి

ఢిల్లీలో రాజ్ పథ్ కు ప్రధాని మోదీ కర్తవ్య పథ్ అని నామకరణం చేయడం తెలిసిందే. నిన్న సెంట్రల్ విస్టా అవెన్యూలో భాగంగా కర్తవ్య పథ్ ను కూడా మోదీ ప్రారంభించారు. బ్రిటీష్ హయాంలో రాజ్ పథ్ ను కింగ్స్ వే అని పిలిచివేవారు. ఇప్పుడది నయా భారత్ కు అనుగుణంగా కర్తవ్య పథ్ గా మారిపోయింది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 

75 ఏళ్లు గడచినా వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా ఉన్న చిహ్నాలను చెరిపివేస్తున్న మోదీ గారు అభినందనీయులు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్తవ్య పథ్... భారతీయత ఉట్టిపడే నామధేయం అని కొనియాడారు. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే, ఆపై రాజ్ పాథ్ గా మారి, ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించిందని పవన్ కల్యాణ్ వివరించారు. 

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంకల్పంతో, వలసవాద పాలనలో ఉద్భవించిన పేర్లు, చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారని జనసేనాని వెల్లడించారు. ఆ వాగ్దానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసం ఉండే వీధిని రేస్ కోర్స్ రోడ్ గా పిలిచేవారని, ఇప్పుడది లోక్ కల్యాణ్ మార్గ్ గా నామకరణం చేశారని వివరించారు. 

అంతేకాకుండా, భారత నావికాదళ పతాకంలో సెయింట్ జార్జ్ క్రాస్ ఉండేదని, దాని స్థానంలో నూతన పతాకాన్ని మోదీ ఆవిష్కరించారని తెలిపారు. ఈ గుణాత్మక చర్యలు బానిస వాదాన్ని నిర్మూలించే అభ్యుదయ చర్యలుగా భావిస్తున్నానని తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఓ విన్నపం చేసుకుంటున్నట్టు తెలిపారు. 'కర్తవ్య పథ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మీ చేతుల మీదుగానే, జపాన్ లో భద్రపరిచిన ఆయన అస్థికలను కూడా రప్పించాల్సిందిగా కోరుతున్నాను' అంటూ విజ్ఞప్తి చేశారు. నేతాజీ మనుమరాలు రాజశ్రీ చౌదరి బోస్ అనుమతితో ఆమె డీఎన్ఏతో ఆ అస్థికలను పోల్చాలని కోరారు. ఇది సాకారమైతే ఆజాదీ అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుందని తెలిపారు భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందని వివరించారు.

  • Loading...

More Telugu News