Queen Elizabeth II: వివాహం సందర్భంగా ఎలిజబెత్-2 కు నిజాం నవాబు ఇచ్చిన ఖరీదైన వజ్రాభరణం
- 1947లో ఎలిజబెత్ వివాహం
- 300 వజ్రాలు పొదిగి ప్లాటినంతో చేసిన ప్రత్యేక హారం
- లండన్ లోని కార్టియర్ కంపెనీకి తయారీ బాధ్యతలు
ఎలిజబెత్ -2 దగ్గరున్న అత్యంత విలువైన ఆభరణాల్లో హైదరాబాద్ నిజాం నవాబు బహూకరించింది కూడా ఒకటి ఉంది. 1947 నవంబర్ 20న ఎలిజబెత్ వివాహం జరిగింది. వివాహ కానుకగా నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్.. 300 వజ్రాలతో రూపొందించిన ప్లాటినం నెక్లెస్ ను కానుకగా అందించారు.
70 ఏళ్ల తన పాలనలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ - 2 ఎన్నో విలువైన కానుకలను అందుకున్నారు. వాటన్నింటిలోకి నిజాం నవాబు ఇచ్చింది ప్రత్యేకమైనదే అని చెప్పుకోవాలి. దీన్ని ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ తయారు చేసింది. రాణి ఎలిజబెత్ స్వయంగా వివాహ కానుకను సెలక్ట్ చేసుకోవాలని, దానికి అనుగుణంగా ఆభరణాన్ని తయారు చేయాలంటూ నాడు నిజాం నవాబు లండన్ లోని కార్టియర్ కంపెనీకి సూచించారట.
రాణి ఎలిజబెత్ ప్లాటినంతో చేసిన ఈ వజ్రాల నెక్లెస్ ను ధరించిన ఫొటోను.. ఈ ఏడాది జులై 21న బ్రిటన్ రాజ కుటుంబం అధికారిక ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 1952లో రాణివాసం చేసిన తర్వాత కూడా ఎలిజబెత్ దీన్ని ధరించారు. నాటి ఫొటోను కూడా ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.