Bharat Jodo Yatra: యాత్రలో రాహుల్ ధరిస్తున్న టీ షర్ట్‌పై బీజేపీ కామెంట్... ఘాటుగా బదులిచ్చిన కాంగ్రెస్
- మూడో రోజుకు చేరిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
- రాహుల్ టీ షర్ట్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ ట్వీట్
- మోదీ ధరించిన దుస్తులపైనా చర్చకు సిద్ధమేనా? అంటూ కాంగ్రెస్ కౌంటర్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారానికి మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ధరించిన ఓ టీ షర్ట్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. యాత్రలో రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్ ధర రూ.41,357 అని పేర్కొన్న... భారతదేశమా ఇది చూడు అంటూ కామెంట్‌ను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా... కాసేపటికే కాంగ్రెస్ పార్టీ ఈ ట్వీట్‌కు బదులిస్తూ ఘాటు కౌంటర్ ఇచ్చింది.
రాహుల్ గాంధీ యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి బీజేపీ వణికిపోతోందని తన కౌంటర్‌లో కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాకుండా దేశంలోని నిరుద్యోగంపై మాట్లాడటానికి బదులుగా రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్‌పై బీజేపీ వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వదిలేసి ఈ తరహా అంశాలపైనే దృష్టి సారిస్తే... తాము కూడా అందుకు సిద్ధంగానే ఉన్నామని కూడా కాంగ్రెస్ గట్టిగానే బదులిచ్చింది.
ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధరించిన దుస్తులు, వాటి ధరలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. దుస్తులపై చర్చిద్దామంటే.. మోదీ ధరించిన సూట్ ధర రూ.10 లక్షలు, మోదీ వినియోగించిన కళ్లద్దాల ధర రూ.1.5 లక్షలపైనా కూడా చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, మరి ఆ తరహా చర్చలకు మీరూ సిద్ధమేనా? అని ప్రశ్నించింది.