Telangana: వైద్యుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడొద్దు.. గవర్నర్​ తమిళిసైపై హరీశ్​ రావు ఆగ్రహం

Telangana Minister Harish rao fires on Governer Tamilisai
  • తెలంగాణలో వైద్యారోగ్య రంగం సరిగా లేదంటూ గవర్నర్ విమర్శలు
  • దానిపై దీటుగా సమాధానమిచ్చిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు
  • కేంద్రం చేతిలో ఉన్న బీబీ నగర్ నిమ్స్ దుస్థితిని గవర్నర్ చూడాలని వ్యాఖ్య
తెలంగాణలో వైద్యారోగ్య రంగం పరిస్థితి బాగోలేదంటూ విమర్శలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. వైద్యుల మనోభావాలు దెబ్బతినేలా గవర్నర్ మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వైద్య వ్యవస్థపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో వైద్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు.

కొంతకాలం నుంచి విభేదాలతో..
తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, నేతల మధ్య కొంతకాలం నుంచి విభేదాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే పరస్పరం గవర్నర్, టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే గవర్నర్ గా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళిసై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించాలని తాను చాలాసార్లు చెప్పానని పేర్కొన్నారు. నిమ్స్‌ డైరెక్టర్‌ వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని విమర్శించారు. యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలను ప్రస్తావించారు. 

బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లి చూడండి
గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావు వివరణతో కూడిన కౌంటర్‌ ఇచ్చారు. వైద్య వ్యవస్థ విషయంపై గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు సరికాదన్నారు. వైద్యుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్‌ కు వెళ్లి చూడాలని.. అక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిని పరిశీలించాలని గవర్నర్ కు సూచించారు.

Telangana
Minister
Harish Rao
TRS
Governor
Tamilisai Soundararajan

More Telugu News