Mallu Bhatti Vikramarka: కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటిదే: భట్టి విక్రమార్క
- జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ సంకేతాలు
- లౌకికవాదులను అడ్డుకునేందుకు శక్తులు పుట్టుకొచ్చాయన్న భట్టి
- కేసీఆర్ జాతీయ పార్టీతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టంలేదని వెల్లడి
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా
త్వరలో జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.
దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లౌకికవాద మద్దతుదారులంతా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారని, అలా వస్తున్న వారిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పుట్టుకొచ్చాయని తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటి శక్తుల్లో ఒకటై ఉండొచ్చని విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీతో కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికలో తాము శాస్త్రీయంగా ఆలోచించి పాల్వాయి స్రవంతిని ఎంపిక చేశామని చెప్పారు. మునుగోడులో స్రవంతి గెలుపు ఖాయమని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.