Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తో దివంగత ఎన్టీఆర్.. అరుదైన ఫొటో ఇదిగో!
- 1983లో హైదరాబాద్ కు విచ్చేసిన క్వీన్ ఎలిజబెత్ 2
- స్వాతగం పలికిన అప్పటి గవర్నర్ రాంలాల్, సీఎం ఎన్టీఆర్
- నాలుగు రోజులు హైదరాబాద్ లోనే గడిపిన రాణి దంపతులు
దివంగత బ్రిటీష్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వెల్లువెత్తుతోంది. మరోవైపు, ఆమెకు హైదరాబాద్ తో కూడా అనుబంధం ఉంది. 1947లో ఎలిజబెత్ వివాహం జరిగింది. అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలిస్తున్నారు. వివాహం సందర్భంగా రాణికి నిజాం నవాబు అత్యంత విలువైన వజ్రాల హారాన్ని కానుకగా అందజేశారు. 300 వజ్రాలు పొదిగిన ఒక ప్లాటినం నెక్లెస్ ను అందించారు. వివిధ సందర్భాల్లో ఎలిజబెత్ రాణి ఆ హారాన్ని అలంకరించుకున్నారు.
మరోవైపు, తన జీవిత కాలంలో బ్రిటీష్ రాణి మూడు సార్లు భారత్ కు వచ్చారు. 1983లో వచ్చినప్పుడు ఆమె హైదరాబాదుకు విచ్చేశారు. ఆ ఏడాది నవంబర్ 20న నగరానికి వచ్చిన రాణి దంపతులకు అప్పటి రాష్ట్ర గవర్నర్ రాంలాల్, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల హైదరాబాద్ పర్యటనలో ఇక్రిశాట్, కుతుబ్ షాహి సమాధులు, బీహెచ్ఈఎల్ లను వారు సందర్శించారు. బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చికి కూడా వెళ్లాడు. క్వీన్ విక్టోరియా ఇచ్చిన నిధులతో 1847లో ఈ చర్చిని నిర్మించారు. క్వీన్ విక్టోరియా మునిమనవరాలు క్వీన్ ఎలిజబెత్ 2. మరోవైపు, ఈ చర్చిలోనే రాణి దంపతులు తమ 36వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.