Heavy rains: తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడ వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుందనే వివరాలివిగో
- జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
- గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడి
- బంగాళా ఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వానలు పడుతున్నట్టు వివరణ
తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వివరించింది. వర్షాలతోపాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. వర్షపాత అంచనాలకు సంబంధించిన మ్యాప్ లను ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
- వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వానలు పడుతున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
- తెలంగాణలోని నారాయణపేట్, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
- వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
- ఇక మిగతా రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
- దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానలు ఆదివారం కాస్త తగ్గుముఖం పడతాయని, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం సోమవారం దాకా భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది.