Hyderabad: ముగిసిన గణేశ్ నిమజ్జనం... హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల ఎత్తివేత
- వేడుకగా సాగిన గణేశ్ శోభా యాత్ర
- నిమజ్జనం కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- రెండు రోజుల పాటు కొనసాగిన ఆంక్షలు
- శనివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తేసిన పోలీసులు
హైదరాబాద్ పరిధిలో రెండు రోజుల పాటు కోలాహలంగా జరిగిన గణేశ్ నిమజ్జనం శుక్రవారం సాయంత్రానికి పూర్తయ్యింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలన్నింటినీ శోభాయాత్ర ద్వారా హుస్సేన్ సాగర్ తరలించిన భక్తులు... విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఏటా అత్యంత వేడుకగా జరుగుతున్న ఈ శోభా యాత్ర కోసం నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.
గురువారం రాత్రి నుంచే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గణేశ్ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌కు తరలివచ్చే ప్రధాన మార్గాల్లోని ట్రాఫిక్‌ను పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా మళ్లించారు. శుక్రవారం ఈ ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా అమలయ్యాయి. శనివారం కూడా సాయంత్రం దాకా ఆంక్షలు అమలు కాగా... సాయంత్రం నాటికి దాదాపుగా అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.