ED: వందకు పైగా యాప్ లు వేల కోట్ల రూపాయలను చైనాకు చేరవేశాయి: ఈడీ
- భారత్ మార్కెట్ పై కన్నేసిన చైనా
- భారత్ ను ముంచెత్తుతున్న చైనా వస్తువులు, సేవలు
- అక్రమ మార్గాలు అవలంబిస్తున్న డ్రాగన్ కంపెనీలు
- కఠిన చర్యలకు దిగిన భారత్
స్వేచ్ఛా వాణిజ్యం పేరిట చైనా అనేక దేశాల మార్కెట్లను కబళిస్తోందన్న ఆందోళనలు ఎప్పటినుంచో ఉన్నాయి. పలు దేశాల మార్కెట్లలో స్థానిక కంపెనీలపై చైనా సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ చైనా వాణిజ్యాన్ని అంతకంతకు విస్తరిస్తున్నాయి. అయితే ఈ ముప్పును పసిగట్టిన భారత్... నిబంధనలు పాటించని చైనా కంపెనీలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.
సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, ఈ డ్రాగన్ దేశం సాగిస్తున్న ఆర్థిక దండయాత్రను కట్టడి చేయడం కూడా అంతేముఖ్యమని భారత్ భావిస్తోంది. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో చైనా కంపెనీలు తీవ్రస్థాయిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెల్లడైంది. వందకు పైగా యాప్ లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) కన్నుగప్పి భారత్ నుంచి చైనాకు వేల కోట్ల రూపాయలు చేరవేస్తున్నట్టు ఈడీ గుర్తించింది.
భారత గడ్డపై కంపెనీలు ఏర్పాటు చేసి, డమ్మీ డైరెక్టర్లను నియమిస్తున్నారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. కొంతకాలం తర్వాత చైనా వ్యక్తులు భారత్ కు వచ్చి ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా చేరుతున్నారని ఆ వర్గాలు వివరించాయి. అందుకు కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు సాయపడుతున్నారని ఆరోపించాయి.
కాగా, ఈ చైనా యాప్ లలో అత్యధికం లోన్ యాప్ లు, డేటింగ్ యాప్ లు, బెట్టింగ్ యాప్ లు ఉన్నాయని వెల్లడైంది. ఈ యాప్ లను చైనా నుంచి నియంత్రిస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. వీటిలో ఒక్క బెట్టింగ్ యాప్ లే రూ.1,300 కోట్ల మేర ఆదాయం రాబట్టాయని ఈడీ పేర్కొంది.
రెండేళ్ల కిందట చైనా డేటింగ్, బెట్టింగ్ యాప్ లకు సంబంధించి హెచ్ఎస్ బీసీ బ్యాంకులోని రూ.47 కోట్లను స్తంభింపజేసిన ఈడీ... ఆ తర్వాత పేటీఎం, క్యాష్ ఫ్రీ, రేజర్ పే వంటి చెల్లింపుల యాప్ లపై దృష్టి సారించింది. ఈ కంపెనీలు తమ అత్యున్నత స్థాయి ఆర్థిక లావాదేవీలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కి నివేదించకపోవడంపై అనుమానించింది. దీనికి సంబంధించి గత వారంలో రూ.17 కోట్లను స్తంభింపజేసింది.