Heavy Rains: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. నేడు వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం
- రెండు రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
- నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- విజయనగరం జిల్లా మద్దువలసలో అత్యధికంగా 15.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లోకి నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నీటిమట్టం క్రమేపీ పెరుగుతుండడంతో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మద్దువలసలో అత్యధికంగా 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏలూరు జిల్లా టి.నరసాపురంలో అత్యధికంగా 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు 48 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు గ్రామాల్లోని కాలనీలు నీటమునిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం బొండా పంచాయతీలోని కొత్తవలస-జయంతివలస గ్రామాల మధ్య పెద్దగెడ్డపై నిర్మించిన కాజ్‌వే కొట్టుకుపోయింది. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా బలపడింది. నేడు అది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా ఉన్న వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండుచోట్ల నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.