NTR District: కర్మకాండలకు వెళ్లి వరదలో చిక్కుకున్న వ్యక్తులు.. తాళ్లతో రక్షించిన స్థానికులు
- ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో ఘటన
- కర్మకాండలు నిర్వహించి వస్తుండగా వరదలో చిక్కుకుపోయిన వ్యక్తులు
- వంతెన పైనుంచి తాళ్లు వేసి రక్షించిన స్థానికులు
కర్మకాండలు నిర్వహించేందుకు వెళ్లిన వ్యక్తులు వరదలో చిక్కుకుపోయి ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. చివరికి స్థానికుల సాయంతో బయటపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన చాగంటి దైవాదీనం రెండు రోజుల క్రితం మృతి చెందగా శనివారం చిన్నకర్మ నిర్వహించేందుకు ఐదుగురు కుటుంబ సభ్యులు, పూజారి కలిసి ట్రాక్టర్‌పై ఏట్లోని దిబ్బపైకి చేరుకున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి అదే ట్రాక్టర్‌పై బయలుదేరారు. కొంతదూరం వచ్చాక వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది.
ఆ తర్వాత కూడా నీటి ఉద్ధృతి కొనసాగడంతో ప్రమాదంలో పడినట్టు గుర్తించిన వారందరూ ప్రాణభయంతో కేకలు వేశారు. అదే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్నవారు గమనించి తాళ్లు తీసుకొచ్చి కిందికి వేసి ఒకరి తర్వాత ఒకరిగా వారిని రక్షించారు. ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం దానిపై ఉన్నాడు. ఈలోగా ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్ దాదాపు మునిగిపోయింది. అయితే, ట్రాక్టర్ కొట్టుకుపోకుండా దాని ఇంజిన్‌కు తాడుకట్టి దానిని పైనున్న గ్రామస్థులకు అందించాడు. ఆ తర్వాత జేసీబీకి తాళ్లను కట్టి లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి జేసీబీని మునేరు వాగులోకి పంపి ట్రాక్టర్‌ను బయటకు తీశారు. ఈ తంతంగం మొత్తం దాదాపు రెండుగంటల పాటు సాగింది. దీంతో అంతసేపూ వంతెనపై వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.