Krishnam Raju: కృష్ణంరాజు మృతి తెలుగు నేలకు తీరని లోటు అన్న చంద్రబాబు.. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారన్న నారా లోకేశ్

Chandrababu and Nara Lokesh pays tributes to Krishnam Raju

  • ఈ తెల్లవారుజామున మృతి చెందిన కృష్ణంరాజు
  • రాజకీయాల్లో కూడా నిజాయతీతో ప్రజలకు సేవలు అందించారన్న చంద్రబాబు
  • ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా ఎదిగారన్న నారా లోకేశ్

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుగారి మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నటునిగా విభిన్న పాత్రలతో మెప్పించిన కృష్ణంరాజు గారు రాజకీయాలలో కూడా నిజాయతీతో ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 

సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా ఎదిగారని చెప్పారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News