Revanth Reddy: కేసీఆర్ కొత్త పార్టీలో కుమారస్వామి తన పార్టీని విలీనం చేస్తారా?: రేవంత్ రెడ్డి
- జాతీయ పార్టీ పెట్టేందుకు కేసీఆర్ సన్నాహాలు
- హైదరాబాదు వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
- ప్రగతిభవన్ లో కేసీఆర్ తో భేటీ
- కాంగ్రెస్ తో ఉన్నవారినే కేసీఆర్ కలుస్తున్నారన్న రేవంత్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత కుమారస్వామి నేడు హైదరాబాద్ విచ్చేసి ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కలయిక నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో కుమారస్వామి తన పార్టీని విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ యూపీఏ భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఏక్ నాథ్ షిండేలను కేసీఆర్ కలవరని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో ఉన్నవారినే కేసీఆర్ కలుస్తుండడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని, సమస్యలను పక్కదారి పట్టించేందుకే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.