Chandrababu: ప్రభాస్ కు భుజం తట్టి ధైర్యం చెప్పిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu pays tributes to Krishnam Raju
  • తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణంరాజు
  • రెబల్ స్టార్ మృతితో దిగ్భ్రాంతికి గురైన సినీ, రాజకీయ వర్గాలు
  • కృష్ణంరాజు నివాసానికి వచ్చిన చంద్రబాబు
  • రెబల్ స్టార్ పార్థివదేహానికి నివాళులు
టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులు అర్పించారు. హైదరాబాదులో ఈ సాయంత్రం కృష్ణంరాజు నివాసానికి వచ్చిన చంద్రబాబు కడసారి వీడ్కోలు పలికారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, కృష్ణంరాజుకు చరిత్రలో ఒక పేజీ ఉందని తెలిపారు. రెబల్ స్టార్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని వెల్లడించారు. సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. కృష్ణంరాజు అందించిన ఘనతర వారసత్వం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. 

ఈ సందర్భంగా ఆయన కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవిని, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభాస్ కు భుజం తట్టి ధైర్యం చెప్పారు. 

చంద్రబాబు వచ్చిన సమయంలో కృష్ణ, ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు, మోహన్ బాబు, నరేశ్ కూడా అక్కడే ఉన్నారు వారు కూడా కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భౌతికకాయానికి మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు తదితరులు కూడా నివాళులు అర్పించారు. 

83 ఏళ్ల కృష్ణంరాజు గత కొంతకాలంగా మధుమేహం, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ కిడ్నీ కూడా పాడైనట్టు తెలుస్తోంది. డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో ఊపిరితిత్తుల్లోనూ తీవ్ర ఇన్ఫెక్షన్ చేరినట్టు వెల్లడైంది. దాంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా, ఈ వేకువ జామున గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం కృష్టంరాజు పార్థివదేహాన్ని హైదరాబాదులోని నివాసం వద్ద ఉంచారు.
Chandrababu
Krishnam Raju
Demise
Tributes
Hyderabad

More Telugu News