Depression: బలహీనపడనున్న వాయుగుండం... ఏపీలో వర్షాలు తగ్గుముఖం
- ఒడిశా, చత్తీస్ గఢ్ వైపు తరలిపోయిన వాయుగుండం
- నేడు అల్పపీడనంగా బలహీనపడే అవకాశాలు
- నేడు, రేపు ఏపీలో అక్కడక్కడ జల్లులు
- తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ చత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణిస్తూ నేడు తీవ్రత తగ్గి అల్పపీడనం స్థాయికి పడిపోతుందని వివరించారు.
ఏపీలో వర్షాలు తగ్గుముఖం పడతాయని, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపారు. అదే సమయంలో సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రంలో అలజడి పూర్తిగా తొలగిపోలేదని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
కాగా, వాయుగుండం ప్రభావం ఏపీపై పెద్దగా కనిపించలేదు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు మినహా రాష్ట్రంలోని మిగతా భాగాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నిన్న పాలకోడేరులో అత్యధికంగా 14 సెంమీ వర్షపాతం నమోదైంది.