KCR: అప్పటి సీఎం చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారి తెలంగాణ మండలాలను కర్కశంగా ఏపీలో కలిపేశారు: సీఎం కేసీఆర్
- తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- రెండోరోజు విద్యుత్ అంశంపై వాడీవేడి ప్రసంగాలు
- రఘునందన్ రావుకు బదులిచ్చిన కేసీఆర్
- మోదీ తొలి క్యాబినెట్ భేటీలోనే దుర్మార్గ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
- మోదీని మరోసారి ఫాసిస్ట్ అంటానని స్పష్టీకరణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విభజన హామీల పరంగా తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు.
అయితే, అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారని, తెలంగాణకు చెందిన ఏడు మండలాలను కర్కశంగా ఏపీలో కలిపేశారని విమర్శించారు. అసెంబ్లీకి ప్రతిపాదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఏపీకే ఇచ్చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ నిర్వహించిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఒక ఫాసిస్టు అని మళ్లీ అంటానని స్పష్టం చేశారు.