Telangana: బీఆర్ఎస్ పెట్టుకోండి... వీఆర్ఎస్ తీసుకోండి: రఘునందన్ రావు
- అసెంబ్లీ సమావేశాల తీరుపై రఘునందన్ రావు వ్యంగ్యాస్త్రాలు
- కేసీఆర్ను జాతీయ పార్టీ పెట్టొద్దని ఎవరన్నారని వ్యాఖ్య
- బీఆర్ఎస్ పెట్టి ఫాం హౌస్కు పరిమితమైనా అభ్యంతరం లేదని సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి సమావేశాల తీరుపై బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కగా.. బీజేపీ సభ్యులకు మాత్రం మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కేసీఆర్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టే దిశగా సాగుతున్న తీరుపై స్పందించిన రఘునందన్ రావు.. జాతీయ పార్టీ పెట్టొద్దని కేసీఆర్ను ఎవరు ఆపారని ప్రశ్నించారు. 'బీఆర్ఎస్ పెట్టుకోండి.. వీఆర్ఎస్ కూడా తీసుకోండి' అని వ్యాఖ్యానించారు. లేదంటే ఫాం హౌస్కు పరిమితమైనా తమకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలవాలని అడుగుతున్నారన్న ఆయన.. హైదరాబాద్ సంస్థానంలోని పాత ప్రాంతాలను తిరిగి తెలంగాణలో కలుపుతూ తీర్మానం చేయండి అని సూచించారు.