Telangana: అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ గాంధీ యాత్ర... రాష్ట్రంలో 350 కిలోమీటర్ల మేర యాత్ర
- పాలమూరు జిల్లా మక్తల్‌లో తెలంగాణలోకి యాత్ర ప్రవేశిస్తుందన్న రేవంత్ రెడ్డి
- మక్తల్ నుంచి మద్నూర్ వరకు తెలంగాణలో యాత్ర సాగుతుందని వెల్లడి
- 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో యాత్ర సాగుతుందన్న టీపీసీసీ చీఫ్
- 3 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు తమిళనాడులో కొనసాగిన ఈ యాత్ర గత శనివారం కేరళలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఎలా కొనసాగనుందన్న విషయంపై సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
అక్టోబర్ 24న రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మక్తల్‌లో రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 15 రోజుల పాటు సాగనున్న రాహుల్ యాత్ర 350 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని చెప్పారు. మక్తల్ నుంచి నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్ వరకు సాగనున్న ఈ యాత్రలో 3 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు రేవంత్ తెలిపారు.