Congress: తెలంగాణకు ప్రత్యేక జెండా.. అధికారిక గీతంగా ‘జయజయహే తెలంగాణ’: రేవంత్ రెడ్డి
- తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న టీపీసీసీ చీఫ్
- వాహనాల రిజిస్ట్రేషన్లను టీఎస్ కు బదులు టీజీ అని మార్చే ప్రతిపాదన ఉందని వెల్లడి
- నిజాం నుంచి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్య
- కానీ బీజేపీ, టీఆర్ఎస్ ఈ అంశాన్ని హైజాక్ చేస్తున్నాయని వ్యాఖ్య
జాతీయ జెండాతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించాలనే ప్రతిపాదనలు వచ్చాయని.. తాము అధికారంలోకి వస్తే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని ఇచ్చిన ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని.. రాష్ట్రం ఏర్పాటయ్యాక కాలగర్భంలో కలిపేశారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించుకునేందుకు అంతా కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తెలంగాణలో సబ్బండ వర్ణాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ పేర్కొన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణకు ఒక ప్రత్యేక జెండా ఉండాలనే ప్రతిపాదనపై సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలని.. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం
నిజాం రాచరిక పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛను అందించిన పార్టీ కాంగ్రెస్ అని.. కాంగ్రెస్ పేటెంట్ ను బీజేపీ, టీఆర్ఎస్ హైజాక్ చేస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని నిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఆ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని పేర్కొన్నారు. బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ఇక టీఆర్‌ఎస్ ను పోలి ఉన్నట్టుగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ అని తీసుకొచ్చారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి టీజీ అని పెట్టుకోవాలనే ప్రతిపాదన కూడా ఉందని ప్రకటించారు.