Ashok Gehlot: అమిత్ షా మఫ్లర్ ధరనే రూ.80 వేలు.. రాహుల్ టీషర్టులపై రాజకీయాలా?: రాజస్థాన్ సీఎం గెహ్లాట్
- రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను తిప్పికొట్టిన రాజస్థాన్ సీఎం
- బీజేపీ నేతలు ధరించే సన్ గ్లాసెస్ ధర రూ.2.5 లక్షలు ఉంటుందని వ్యాఖ్య
- భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను ఓర్చుకోలేక బీజేపీ ఆరోపణలకు దిగుతోందని మండిపాటు
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక బీజేపీ ఆందోళనకు గురవుతోందని, తప్పుడు ఆరోపణలకు దిగుతోందని రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. టీ షర్టుల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ధరించిన టీ షర్టు ధర రూ.41 వేలు అంటూ బీజేపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై గెహ్లాట్ మండిపడ్డారు.
బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?
కేంద్ర మంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకు పైనే ఉంటుందని.. బీజేపీ నేతలు ధరించే సన్ గ్లాసెస్ ధర రూ. 2.50 లక్షలకు పైనే ఉంటుందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రతో బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ‘‘బీజేపీ నేతలు రూ.2.50 లక్షల సన్ గ్లాసెస్, రూ.80 వేల మఫ్లర్లు ధరిస్తూ.. రాహుల్ గాంధీ టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకుపైనే ఉంటుంది. అయినా టీ షర్టులపై బీజేపీ రాజకీయాలు చేస్తోంది”.. అని గెహ్లాట్ మండిపడ్డారు.
మోదీ సూట్, కళ్లజోడు గురించి మాట్లాడరేం?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రూ.41వేల విదేశీ టీషర్ట్ ధరించారని బీజేపీ విమర్శలకు దిగింది. దీనిపై కాంగ్రెస్ కూడా దీటుగా స్పందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో రూ.10 లక్షల సూట్, రూ.1.5 లక్షల కళ్లజోడు ధరించిన విషయం గురించి మాట్లాడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.