Article 370: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తాం: పీడీఎఫ్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ
- కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించుకుంటామన్న మాజీ సీఎం
- ఇది సాధ్యం కాదన్న గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై స్పందించిన ముఫ్తీ
- అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీఎఫ్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. కశ్మీర్ కు ప్రత్యేక హోదా తిరిగి తేవడం సాధ్యం కాదని ఆజాద్ ఇటీవల అభిప్రాయపడ్డారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370ని తిరిగి తేవాలంటే కాంగ్రెస్ కు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, అది తన జీవితకాలంలో కశ్మీర్ కు రాదని ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై ముఫ్తీ స్పందించారు.
'ఇది ఆజాద్ వ్యక్తిగత అభిప్రాయం. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం జరుగుతుందని దృఢంగా విశ్వసించే వారు ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నా. ఆర్టికల్ 370ని తొలగించడం సమస్యను మరింత క్లిష్టతరం చేసిందని నేను భావిస్తున్నాను. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్.. వారి దురాగతాలను అంతం చేసింది. అదేవిధంగా జమ్మూకశ్మీర్ లో ఇటువంటి అనేక స్వరాలు ఉన్నాయి. మేము ఆర్టికల్ 370ని పునరుద్ధరించడమే కాకుండా ఈ వివాదాన్ని కూడా పరిష్కరిస్తామని గట్టిగా విశ్వసిస్తున్నాము' అని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ దురాగతాలను అంతం చేస్తామని మెహబూబా అన్నారు. 'ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్‌తో ఎల్‌కే అద్వానీ కరచాలనం చేస్తారని, నవాజ్ షరీఫ్ మనవరాలి వివాహానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్ వెళ్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ముజఫరాబాద్ రోడ్డు తెరుస్తారని ఎవరైనా అనుకున్నారా? ఏదైనా మన ఆలోచనల్లోనే ఉంటుంది. మాకు సానుకూల ఆలోచన ఉంది. మేము బీజేపీ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా వాటిని అంతం చేసి, కశ్మీర్ వివాదాన్ని పరిష్కరిస్తాము' అని ముఫ్తీ అభిప్రాయపడ్డారు.