YSRCP: అమరావతి రైతుల మహాపాదయాత్రపై కేంద్ర హోం మంత్రికి ఎంపీ రఘురామరాజు లేఖ
- కేంద్ర బలగాలతో యాత్రకు భద్రత కల్పించాలన్న రఘురామరాజు
- హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా మంత్రులు 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నారని ఫిర్యాదు
- యాత్రలో అలజడి సృష్టించే దిశగా ప్రభుత్వం సాగుతున్నట్లుగా అనుమానాలున్నాయన్న ఎంపీ
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కొనసాగిస్తున్న అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మంగళవారం లేఖ రాశారు. సోమవారం అమరావతి నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించగా... రైతుల పిటిషన్‌తో హైకోర్టు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యాత్రపై అమిత్ షాకు రఘురామరాజు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమరావతి రైతులు దాదాపుగా వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తున్నారని రఘురామరాజు వివరించారు. ఈ యాత్రకు ముందు న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట ఓ యాత్ర చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రాజధాని వ్యవహారంపై హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రులు 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని తెలిపారు.
ఈ చర్యలన్నింటినీ చూస్తుంటే పాదయాత్రలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగుతున్నట్లుగా కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అమరావతి రైతుల పాదయాత్రకు కేంద్ర ఏజెన్సీల ద్వారా భద్రత చర్యలు చేపట్టాలని తన లేఖలో అమిత్ షాను రఘురామరాజు కోరారు.