Kadiam Srihari: కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు ఏపీకి అన్నీ ఇప్పించుకున్నారు.. కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు: కడియం శ్రీహరి

Kishan Reddy doing nothing to Telangana says Kadiam Srihari

  • విభజన సమయంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కడియం 
  • రాష్ట్ర బీజేపీ నేతలు చేతకాని చవటలని విమర్శ 
  • కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని పిలుపు 

బీజేపీపై టీఆర్ఎస్ విమర్శల దాడిని ముమ్మురం చేస్తోంది. తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ... తెలంగాణ పురోగతి దిశగా వెళ్తుంటే, భారత దేశం తిరోగమన దిశగా వెళ్తోందని అన్నారు. దేశానికి బీజేపీ నుంచి విముక్తి కావాలని... జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. 

రాష్ట్ర విభజన సమయంలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. అన్ని కేంద్ర విద్యా సంస్థలు ఏపీలో నెలకొల్పేలా విభజన చట్టంలో పొందుపరిచారని అన్నారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్శిటీ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సినవన్నీ దగ్గరుండి ఇప్పించుకున్నారని... తెలంగాణకు కూడా ఒక కేంద్ర మంత్రి ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఆయన రాష్ట్రానికి మరేమీ చేయరని మండిపడ్డారు. 

కిషన్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు చేతకాని చవటలని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు వెళ్తోందని... అయితే దాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు.

  • Loading...

More Telugu News