Virat Kohli: మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఈసారి ఫీల్డ్ బయట!
- ట్విట్టర్ లో కోహ్లీకి 50 మిలియన్ల ఫాలోవర్లు
- ట్విట్టర్లో అత్యధిక మంది అనుసరిస్తున్న క్రికెటర్గా ఘనత
- ఓవరాల్గా సోషల్ మీడియాలో కోహ్లీకి 310 మిలియన్ల మంది ఫాలోవర్లు
మూడేళ్ల పేలవ ఫామ్ కు పుల్ స్టాప్ పెడుతూ ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై సెంచరీతో తిరిగి గాడిలో పడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ట్విట్టర్లో 50 మిలియన్ల ఫాలోవర్లతో సరికొత్త రికార్డు కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. కోహ్లీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఫాలోవర్ల సంఖ్య తాజాగా 50 మిలియన్ల మార్కు దాటింది. అంటే ఐదు కోట్ల మంది ట్విట్టర్ లో విరాట్ ను ఫాలో అవుతున్నారు.
33 ఏళ్ల కోహ్లీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 211 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (450 మిలియన్లు), లియోనెల్ మెస్సీ (333 మిలియన్ల) తర్వాత ఇన్స్టాగ్రామ్ అత్యధికంగా అనుసరించే మూడో క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం. కోహ్లీకి ఫేస్బుక్లో 49 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో 310 మిలియన్లకు పైగా కోహ్లీని ఫాలో చేస్తున్నారు. అంటే 31 కోట్ల మంది భారత క్రికెట్ దిగ్గజాన్ని అనుసరిస్తున్నారు.