Fakira: భార్య అంగీకారంతో ట్రాన్స్ జెండర్ ను పెళ్లాడిన వ్యక్తి
- ఒడిశాలోని కలహండి జిల్లాలో ఘటన
- తొలిచూపులోనే హిజ్రాతో ప్రేమలో పడిన వ్యక్తి
- ఇరువురి మధ్య లవ్ అఫైర్
- నిలదీసిన భార్య.. ప్రేమాయణం వెల్లడించిన భర్త
ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఫకీరా నియాల్ అనే వ్యక్తి ట్రాన్స్ జెండర్ ను పెళ్లాడాడు. 32 ఏళ్ల ఆ వ్యక్తి అప్పటికే వివాహితుడు కాగా, తాజాగా ట్రాన్స్ జెండర్ తో వివాహానికి అతడి భార్య కునీ కూడా అంగీకారం తెలపడం విశేషం. అంతేకాదు, అందరం కలిసే ఉందాం అంటూ ఆ మహిళ తన విశాల హృదయాన్ని చాటింది.
ఫకీరా నియాల్, కునీ దంపతులకు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ ట్రాన్స్ జెండర్ పేరు సంగీత. ఒకనాడు ఆ ట్రాన్స్ జెండర్ దుకాణాల వద్ద భిక్షాటన చేస్తుండగా ఫకీరా చూశాడు. తొలిచూపులోనే ఆ హిజ్రాతో ప్రేమలో పడిపోయాడు. ఆపై ఇరువురు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది.
ఈ విషయం భార్యకు తెలియడంతో ఫకీరాను నిలదీసింది. హిజ్రాతో అఫైర్ నిజమేనని అతడు అంగీకరించాడు. భర్త అప్పటికే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడని గ్రహించిన కునీ... ట్రాన్స్ జెండర్ తో అతడి వివాహానికి సమ్మతించింది. భార్య కూడా అడ్డుచెప్పకపోవడంతో ఫకీరా, ట్రాన్స్ జెండర్ సంగీతను నర్లాలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ట్రాన్స్ జెండర్లు భారీగా తరలివచ్చి వారిని ఆశీర్వదించారు.
కాగా, ఈ పెళ్లిపై ఒడిశా హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ మొహంతీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ మహిళనైనా, ఓ ట్రాన్స్ జెండర్ నైనా రెండో పెళ్లి చేసుకోవడం అనేది హిందూ వివాహ చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అది చెల్లదని, శిక్షార్హం అని వివరించారు.