Ukraine: ఉక్రెయిన్​ పై విమానాలు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాం.. రష్యా ప్రకటన

Massive strikes on Ukraine says russia

  • రష్యాపై ఉక్రెయిన్ సైన్యం ఆధిపత్యం చూపుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ దేశ రక్షణ శాఖ స్పందన
  • ప్రాణ నష్టాన్ని నివారించేందుకే క్షేత్రస్థాయిలో కొంత వెనక్కి తగ్గినట్టు వివరణ
  • ఉక్రెయిన్ మిలటరీ, మౌలిక సదుపాయాల లక్ష్యంగా క్షిపణి దాడులు జరుగుతున్నట్టు వెల్లడి

ఉక్రెయిన్ సైన్యం తమపై ఆధిపత్యం చూపుతోందన్న వార్తలు సరికాదని.. తాము తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తున్నామని రష్యా ప్రకటించింది. ప్రాణ నష్టం తగ్గించడానికే క్షేత్రస్థాయిలో కొంత వెనక్కి తగ్గామని.. విమానాలతో దాడులు భీకరంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. అన్ని మార్గాల్లో ఉక్రెయిన్‌ పై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. రష్యాకు చెందిన వైమానిక, రాకెట్‌, ఫిరంగి దళాలు ఉక్రెయిన్‌ సేనలపై అన్ని దిక్కులా విరుచుకు పడుతున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ లోని మిలటరీ, విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా క్షిపణి దాడులు కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది.

భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వార్తలతో..
ఉక్రెయిన్‌ పై కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా మెల్లగా వెనుకబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యాలు రష్యా సేనలను దెబ్బతీస్తూ తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు, నేతలు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.

ఉక్రెయిన్‌ దళాల ఆకస్మిక దాడులతో తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో రష్యా నుంచి 6 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఇటీవల ప్రకటించారు. తమ బలగాలు మరింత ముందుకు దూసుకెళ్తున్నాయనీ చెప్పారు. ఉక్రెయిన్‌ సైన్యం దూకుడుగా ముందుకు వెళుతోందని అమెరికా కూడా పేర్కొంది. వీటన్నింటి నేపథ్యంలో తాము తీవ్రంగా దాడులు కొనసాగిస్తున్నామంటూ రష్యా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News