Andhra Pradesh: ఈ నెల 27న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కీలక సమావేశం... అజెండాలో ఏపీ రాజధాని అంశం
- ఢిల్లీ నార్త్ బ్లాక్ లో సమావేశం
- ఏపీ, తెలంగాణకు సమాచారమిచ్చిన కేంద్ర హోంశాఖ
- రెండు విభాగాలుగా చర్చల అజెండా
- ద్వైపాక్షిక అంశాలు, ఇతర అంశాలుగా అజెండా
ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఢిల్లీలో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చర్చించే అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం అందించారు. ఈ సమావేశం అజెండాలో ఏపీ నూతన రాజధాని నగర నిర్మాణం అంశం కూడా ఉంది.
కాగా, చర్చల సౌలభ్యం కోసం ఈ సమావేశం అజెండాను ద్వైపాక్షిక అంశాలు, ఇతర అంశాలుగా విభజించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ద్వైపాక్షిక అంశాల విభాగంలో చేర్చారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలను ఇతర అంశాల విభాగంలో చేర్చారు. ఇతర అంశాల కేటగిరీలోనే ఏపీ నూతన రాజధాని నగరం ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ సహకారం, నూతన రాజధాని నగరం నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ నిర్మాణం అంశాలు ఉన్నాయి.