Pakistan Boat: భారత తీరంలో ప్రవేశించిన పాకిస్థాన్ బోటు పట్టివేత... రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- డ్రగ్స్ అక్రమరవాణాకు అడ్డాగా గుజరాత్ తీరం
- గతేడాది రూ.21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- గుజరాత్ తీరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడిన వైనం
- పోలీసుల అదుపులో ఆరుగురు వ్యక్తులు
పాకిస్థాన్ నుంచి భారత్ కు ఉగ్రవాదం, ఆయుధాలే కాదు డ్రగ్స్ కూడా ఎగుమతి అవుతున్నాయి! గుజరాత్ తీరం అందుకు అడ్డాగా మారింది. 2021లో ముంద్రా పోర్టులో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడడం తెలిసిందే.
తాజాగా డ్రగ్స్ తో ఉన్న ఓ పాకిస్థాన్ బోటును గుజరాత్ తీరంలో గుర్తించారు. జఖావ్ పోర్టుకు 33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఆ బోటును కోస్ట్ గార్డ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ బోటును కోస్ట్ గార్డ్ నిఘా నౌక తీరానికి చేర్చింది.
ఆ బోటులో 40 కిలోల డ్రగ్స్ ఉండగా, దాని విలువ రూ.200 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. బోటులోని ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.