IBM: ఇప్పుడు ఐబీఎం కూడా!... మూన్ లైటింగ్‌ను సహించేది లేదని ఉద్యోగులకు వార్నింగ్!
- వర్క్ ఫ్రం హోంతో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలు
- అలా కుదరదని తేల్చి చెప్పిన ఇన్ఫోసిస్, విప్రో
- తాజాగా మూన్ లైటింగ్‌పై ఆదేశాలు జారీ చేసిన ఐబీఎం
కరోనా నేపథ్యంలో అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోం విధానాన్ని వినియోగించుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు (మూన్ లైటింగ్) చేస్తున్న వైనంపై టెక్ దిగ్గజాలు కత్తులు దూస్తున్నాయి. ఇప్పటికే భారత టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రోలు మూన్ లైటింగ్‌ను సహించేది లేదని తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ధిక్కరించి మూన్ లైటింగ్‌కు పాల్పడితే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని కూడా ఆ సంస్థలు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇన్ఫోసిస్, విప్రో బాటలోనే ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా నడుస్తోంది. మూన్ లైటింగ్‌కు పాల్పడితే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని ఆ సంస్థ తన ఉద్యోగులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ మాట్లాడుతూ... తమ సంస్థలో చేరే సమయంలో తాము కేవలం ఐబీఎం కోసం మాత్రమే పనిచేస్తామన్న ఒప్పందాలపై ఉద్యోగులు సంతకాలు చేశారని తెలిపారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగులను ఉద్యోగాల్లో నుంచి తప్పించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన తెలిపారు.