Andhra Pradesh: చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ... అసెంబ్లీలో 15 అంశాలు లేవనెత్తాలని నిర్ణయం
- రేపు ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీఎల్పీలో చర్చ
- అమరావతిలో అక్రమాలంటూ కేసుల నమోదుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం టీడీపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది.
శాసన సభా సమావేశాల్లో మొత్తంగా 15 అంశాలను లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అమరావతిలో అక్రమాల పేరిట కేసులు నమోదు చేస్తున్న వైనంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించింది. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేపథ్యంలో అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ తాజాగా అరెస్ట్లకు దిగిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసలు ఎలాంటి లావాదేవీలే జరగని అంశాలపై కేసులేమిటని టీడీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ అధికారులపై ప్రైవేట్ కేసులు వేసే విషయంపైనా ఈ భేటీలో చర్చ జరిగింది.