Andhra Pradesh: అమరావతి అసైన్డ్ భూముల కేసులో మరో ముగ్గురి రిమాండ్‌కు కోర్టు నిరాకరణ
- అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ
- మంగళవారం ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు జడ్జీ నిరాకరణ
- బుధవారం మరో ముగ్గురిని కోర్టులో హాజరు పరచిన సీఐడీ
- నిందితులకు సీఆర్పీసీ 41 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వాలన్న న్యాయమూర్తి
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులో నిన్న అరెస్టు చేసిన మరో ముగ్గురు నిందితులకు రిమాండ్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరించింది. అమరావతిలోని అసైన్డ్ భూములను టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ తన బంధువుల పేరిట నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారంటూ కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు... ఈ కేసులో పాత్ర ఉందంటూ మంగళవారం కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఐదుగురు నిందితుల్లో మంగళవారమే కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా... వారిని రిమాండ్‌కు తరలించేందుకు న్యాయమూర్తి నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం మరో ముగ్గురు నిందితులు చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులోనే హాజరు పరిచారు. ఈ సందర్భంగా వీరి రిమాండ్‌కు కూడా న్యాయమూర్తి నిరాకరించారు. నిందితులకు సీఆర్పీసీ 41 సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేయాలని, వారిపై నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా వారిని రిమాండ్‌కు తరలించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు.