Namibia: 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి మళ్లీ చీతాలు.. నమీబియా నుంచి విమానంలో తీసుకొస్తున్న ప్రభుత్వం
- 1948లో చనిపోయిన దేశంలోని చివరి చీతా
- 1952లో చీతాలను అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చిన భారత ప్రభుత్వం
- చీతాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితం సుప్రీం గ్రీన్ సిగ్నల్
- కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టనున్న ప్రధాని మోదీ
అంతరించి పోతున్న జాతుల జాబితాలోకి చేరిన చీతాలు మన దేశంలో మళ్లీ అడుగుపెట్టబోతున్నాయి. ఈనెల 17న నమీబియా నుంచి ప్రత్యేక బోయింగ్ విమానంలో 8 చీతాలు భారత్‌కు రాబోతున్నాయి. ఇందుకోసం బి747 జంబోజెట్ విమానాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. భారత్‌కు రాబోతున్న వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి.
నమీబియాలోని విండ్‌హోక్ విమానాశ్రయంలో చీతాలతో బయలుదేరే విమానం 16 గంటలు ప్రయాణించి జైపూర్‌లో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి హెలికాప్టర్‌లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు వీటిని తరలిస్తారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వీటిని పార్క్‌లో విడిచిపెడతారు.
వీటి వయసు నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య ఉన్నట్టు అధికారులు తెలిపారు. చీతాలను చూసుకునేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కాగా, వీటిని ఎంపిక చేయడానికి ముందు వాటి ఆరోగ్యం, క్రూరత్వం, వేటాడే నైపుణ్యం, భవిష్యత్తులో వాటి సంతతిని పెంచగల జన్యు సామర్థ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు.
భారత్‌లో చీతాలు ప్రవేశించడం 74 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. చత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో కనిపించిన చివరి చీతా 1948లో చనిపోయిన తర్వాత దేశంలో వాటి ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. భారత ప్రభుత్వం 1952లో వీటిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. చివరి చీతా చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో చీతాల జాడ లేకుండా పోయింది. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత అవి భారత్‌లో కనిపించబోతున్నాయి. కాగా, నమీబియా నుంచి చీతాలు భారత్‌కు చేరుకున్న తర్వాత తొలుత వీటిని నెల రోజులపాటు క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు.
అంతరించిపోతున్న వన్యప్రాణి జాబితాలో చేరిన చీతాలను తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు జనవరి 2020లో ఓకే చెప్పింది. అందులో భాగంగానే చీతాలు భారత్‌లో అడుగుపెట్టబోతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా 7500 చీతాలు మాత్రమే ఉన్నాయి.