Andhra Pradesh: జాబ్ లు ఇవ్వలేని జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. టీడీపీ సభ్యులు రెడ్ లైన్ దాటారన్న బుగ్గన
- శాసనసభను కుదిపేస్తున్న జాబ్ క్యాలెండర్ అంశం
- స్పీకర్ పోడియంలోకి వెళ్లి నినాదాలు చేస్తున్న టీడీపీ సభ్యులు
- ప్లకార్డులు పట్టుకుని సభలోకి రావడం సరికాదన్న బుగ్గన
అందరూ ఊహించినట్టుగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. జాబ్ క్యాలెండర్ కు సంబంధించి టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో, టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. జాబ్ లు ఇవ్వలేని సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ వారు నినదిస్తున్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై ఆర్థిక మంత్రి బుగ్గన మండిపడ్డారు. టీడీపీ సభ్యులు కావాలనే సభలో రచ్చ చేస్తున్నారని అన్నారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి రెడ్ లైన్ ను దాటారని అన్నారు. ప్లకార్డులు పట్టుకుని సభలోకి రావడం సరికాదని చెప్పారు.
మరో మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం పని చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. టీడీపీ సభ్యులకు సమస్యలపై చర్చించే దమ్ము లేదని అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి జరగబోయేది శవయాత్రేనని ఆయన వ్యాఖ్యానించారు.