Ranveer Singh: ఆన్ లైన్ లో దర్శనమిస్తున్న నా నగ్న ఫొటోలు మార్ఫింగ్ చేసినవి: రణవీర్ సింగ్
- ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ ఫొటోషూట్
- సోషల్ మీడియాలో కలకలం రేపిన రణవీర్ నగ్నఫొటోలు
- పోలీసు కేసు నమోదు .. రణవీర్ కు నోటీసులు
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం దుస్తుల్లేకుండా ఫొటోషూట్ చేసి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రణవీర్ సింగ్ పై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో రణవీర్ కు పోలీసులు నోటీసులు పంపారు.
అయితే, ఆన్ లైన్ లో దర్శనమిస్తున్న తన నగ్న ఫొటోలు ఒరిజినల్ కాదని, వాటిని మార్ఫింగ్ చేశారని రణవీర్ అంటున్నారు. ఒరిజినల్ గా తాను ఫొటోషూట్ లో దిగిన ఫొటోలకు, ఆన్ లైన్ లో కనిపిస్తున్న ఫొటోలకు తేడా ఉందని పేర్కొన్నారు. బయట ప్రచారంలో ఉన్నవి మార్పులు చేర్పులు చేసిన ఫొటోలు అని, తాను ఫొటోషూట్ లో అలాంటి ఫొటోలు దిగలేదని వివరణ ఇచ్చారు.
ఈ కేసులో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న రణవీర్ తన వాంగ్మూలం రికార్డు చేసిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. అలాంటి ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా నుంచి అసలు పంచుకోలేదని స్పష్టం చేశారు.