Congress: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు
- మనీ ల్యాండరింగ్ కేసులో డీకేకు ఈడీ నోటీసులు
- స్వయంగా వెల్లడించిన కర్ణాటక పీసీసీ చీఫ్
- ఈడీ దర్యాప్తునకు సహకరిస్తానన్న సీనియర్ నేత
- రాజ్యాంగ, రాజకీయ విధులు ముగిశాకే ఆ సహకారమని వెల్లడి
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఇప్పటికే శివకుమార్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల కంటే ముందు ఆదాయపన్ను శాఖ నమోదు చేసిన కేసుల్లో గతంలో శివకుమార్ కుమార్తెను కూడా దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. తాజాగా మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై నేరుగా శివకుమార్‌కే గురువారం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శివకుమారే వెల్లడించారు.
ఈడీ అధికారులు తమ ముందు విచారణకు హాజరు కావాలని జారీ చేసిన నోటీసులు తనకు అందాయని శివకుమార్ వెల్లడించారు. ఈడీ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని కూడా ఆయన వెల్లడించారు. అయితే చట్టపరంగా, రాజకీయపరంగా తాను నిర్వర్తించాల్సిన విధులను మాత్రం పక్కనపెట్టలేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, త్వరలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించనుందని ఆయన తెలిపారు. ఈ రెండు విధులూ తనకు ముఖ్యమేనని, వీటి తర్వాతే ఈడీ విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.