Chenab Bridge: మేఘాలపై నుంచి స్వర్గానికి వంతెన వేసినట్టుగా.. కశ్మీర్ లో చీనాబ్ బ్రిడ్జి అందాలు ఇవిగో
- కొత్తగా కట్టిన రైల్వే బ్రిడ్జి ఫొటోలను విడుదల చేసిన రైల్వే శాఖ
- అందమైన చీనాబ్ బ్రిడ్జి అందాలు ఇవిగో అంటూ ట్విట్టర్ లో పోస్టులు
- అద్భుతమంటూ నెటిజన్ల కామెంట్లు.. వేలకొద్దీ లైకులు
- ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన అంటున్న అధికారవర్గాలు
చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. మధ్యలో నది.. దానిపై బ్రిడ్జి.. ఓ అందమైన దృశ్యం. అంతటా ఉండే అందం కాదు ఇది.. అసలు భూమి నుంచి మేఘాల మీదుగా స్వర్గానికి మార్గం వేసినట్టున్న అద్భుతమైన దృశ్యమిది. ఇదంతా ఎక్కడో, ఏ యూరోపియన్ దేశాల్లోనో కాదు.. అచ్చంగా మన కశ్మీర్ లో చీనాబ్ లోయలో ఇటీవల కనిపించి అలరించిన దృశ్య కావ్యం. భారత రైల్వే తాజాగా ఈ బ్రిడ్జికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్ లో షేర్ చేసింది.
ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన
- జమ్మూ కశ్మీర్ లో కొత్త రైలు మార్గం కోసం చీనాబ్ నదిపై రైల్వే శాఖ అధునాతన స్టీల్ వంతెనను నిర్మించింది. రేసి జిల్లాలో బక్కాల్ – కౌరి మార్గంలో ఇటీవలే ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. వచ్చే డిసెంబర్ లోనే దాని మీదుగా రైళ్ల రాకపోకలను ప్రారంభించనున్నారు.
- ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన అని అధికారులు చెబుతున్నారు. చీనాబ్ బ్రిడ్జ్ గా పిలుస్తున్న ఈ వంతెనకు సంబంధించిన చిత్రాలను రైల్వే శాఖ ఇటీవల ట్విట్టర్ లో పెట్టింది. ‘అత్యంత అద్భుతమైన చీనాబ్ వంతెన దృశ్యాలు ఇవి’ అంటూ కామెంట్ పెట్టింది.
- చీనాబ్ వంతెన చిత్రాలను చూసిన వారు.. ఆ వాతావరణాన్ని, ప్రకృతి అందాలను చూసి నోరెళ్లబెడుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించాలన్న భావన వ్యక్తం చేసినవారూ ఎందరో.
- అంత ఎత్తున రైల్వే వంతెన నిర్మించిన రైల్వే శాఖను చాలా మంది అభినందిస్తున్నారు.