Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయండి... సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
- గాలి జనార్దన్ రెడ్డిపై గనుల అక్రమ తవ్వకాల కేసు
- చాలా కాలం జైల్లోనే ఉన్న కర్ణాటక మాజీ మంత్రి
- కండిషనల్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
- జనార్దన్ రెడ్డిని బళ్లారి నుంచి బయటకు పంపాలన్న సీబీఐ
- నిందితుల కారణంగానే విచారణలో జాప్యమని వెల్లడి
గనుల తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో చాలా కాలం పాటు జైల్లోనే ఉన్న జనార్దన్ రెడ్డి... సుప్రీంకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. ప్రస్తుతం తన సొంతూరు బళ్లారిలోనే ఉంటున్న ఆయన బెయిల్‌పైనే ఉన్నారు. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌లో జనార్దన్ రెడ్డికి సంబంధించి సీబీఐ అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆయన సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించిన సీబీఐ... మొత్తం కేసునే ఆయన పక్కదోవ పట్టిస్తున్నారని కోర్టుకు తెలిపారు. పదే పదే డిశ్చార్జీ పిటిషన్లను దాఖలు చేస్తున్న నిందితులు.. కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బళ్లారిలో ఉంటున్న జనార్దన్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించాలని కూడా సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును కోరారు.