Uttar Pradesh: భారీ వర్షాలకు కూలిన గోడలు.. యూపీలో 12 మంది సజీవ సమాధి
- అల్పపీడనం కారణంగా యూపీలో విస్తారంగా వర్షాలు
- గోడలు కూలి లక్నోలో 9 మంది, ఉన్నావోలో ముగ్గురి మృతి
- రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం
ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న వానల కారణంగా గోడలు కూలిన ఘటనలో 12 మంది సజీవ సమాధి అయ్యారు. యూపీ రాజధాని లక్నోలోని దిల్‌కుషా ప్రాంతంలో నేడు ఇంటి గోడ కూలిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉన్నావోలో జరిగిన మరో ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న ఈ నెలలోనే అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వానల కారణంగా నేడు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.