Begusarai: రైలులో చోరీకి యత్నించిన దొంగ.. పట్టుకుని ఎలా శిక్షించారో చూడండి!
- బీహార్‌లోని సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఘటన
- ప్రయాణికుడి సెల్‌ఫోన్ కోసం కిటికీ నుంచి చేతులు పెట్టిన దొంగ
- చేయి పట్టుకున్న ప్రయాణికుడు
- 15 కిలోమీటర్ల పాటు కిటికీ వద్దే వేలాడిన వైనం
రైలులో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ ప్రయాణికులకు పట్టుబడి నరకం అనుభవించాడు. జీవితంలో మళ్లీ దొంగతనాలకు పాల్పడకుండా అతడికి ఇది గుణపాఠం అవుతుందని చూసినవారు అంటున్నారు. బీహార్‌లో జరిగిందీ ఘటన. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగింది. ప్లాట్‌ఫామ్‌పై మాటువేసిన ఓ దొంగ అదే అదునుగా రైలు కిటికీలోంచి ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ను చోరీ చేసేందుకు యత్నించాడు. క్షణాల్లోనే అప్రమత్తమైన ప్రయాణికుడు చటుక్కున అతడి చేయి పట్టుకున్నాడు.
అదే సమయంలో రైలు కదలడంతో దొంగ తనను వదిలేయాలని ప్రాథేయపడ్డాడు. ఈలోపు రైలు ప్లాట్‌ఫామ్ దాటింది. దీంతో పట్టుకోల్పోతుండడంతో రెండో చేతిని కూడా దొంగ కిటికీలో పెట్టాడు. లోపలున్న ప్రయాణికులు ఆ చేతిని కూడా గట్టిగా పట్టుకుని కిందపడిపోకుండా కాపాడారు. ఇలా 15 కిలోమీటర్లపాటు దొంగ కిటికీ వద్దే వేలాడాడు. ఆ తర్వాత రైలు ఖగారియా స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో అతడిని విడిచిపెట్టారు. అనంతరం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరేమో దొంగకు భలేగా బుద్ధి చెప్పారని అంటుంటే.. దొంగ అయితే మాత్రం అలా వేలాడదీయడం చాలా దారుణమని అంటున్నారు.