Telangana: నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
- నాడు భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ సంస్థానం
- సెప్టెంబరు 17న 75వ ఏట అడుగుపెడుతున్న చారిత్రక ఘట్టం
- తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలు
- నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన ఘట్టం రేపు సెప్టెంబరు 17న 75వ ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది.
ఇందులో భాగంగా సెప్టెంబరు 16న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీయువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆదివాసీ గిరిజన కళారూపాలతో భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు.
సెప్టెంబరు 18న జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు, కవులకు, కళాకారులకు సన్మానాలు చేపడతారు. జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది.