Nakka Anand Babu: దేవుడికి కూడా ప్రాంతాలను ఆపాదించారు: జగన్ పై నక్కా ఆనందబాబు
- ప్రాంతాల మధ్య విద్వేషాలను పెంచేలా సీఎం మాట్లాడుతున్నారన్న ఆనందబాబు
- అమరావతికి గతంలో జగన్ ఆమోదం తెలిపారన్న ధూళిపాళ్ల
- జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్
అమరావతి రైతుల పాదయాత్రపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలని ఉత్తరాంధ్రలోని దేవుడికి మొక్కేందుకు వీళ్లంతా బయల్దేరానని జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆనందబాబు మాట్లాడుతూ... చివరకు దేవుడికి కూడా ప్రాంతాలను ఆపాదించడం దారుణమని అన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను పెంచేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాపట్ల జిల్లా కొల్లూరు వద్ద అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో ఈరోజు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి జగన్ ఆమోదం తెలిపారని... ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని జగన్ చెపుతున్నారని... ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.