Supreme Court: విద్యా సంస్థల్లో కామన్ డ్రెస్ కోడ్ పై విచారణ జరపలేం: సుప్రీంకోర్టు
- విద్యా హక్కు చట్టం కింద మార్గదర్శకాలు జారీ చేయాలని కోరిన పిటిషనర్లు
- సమానత్వం, సోదర భావం పెంపొందడానికి అవసరమని వాదన
- ఇది కోర్టును ఆశ్రయించాల్సిన అంశం కాదని చెప్పిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యా సంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణకు నిరాకరించింది.
లౌకికతత్వాన్ని కాపాడేందుకు అంటూ..
దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్ కోడ్ అవసరమంటూ నిఖిల్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పాఠశాలలు, విద్యా సంస్థల్లో లౌకికతత్వాన్ని కాపాడేందుకు ఇది అవసరమని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశమని, విద్యా హక్కు చట్టం కింద ఈ అంశంలో మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.ధులియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిశీలించింది. అయితే ఇది కోర్టుకు రావాల్సిన అంశమే కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకోలేమంటూ విచారణకు నిరాకరించింది.